జేడీఎస్‌లో తిరుగుబాటు.. రిజైన్ చేసిన సీనియర్ ముస్లిం నాయకులు

Update: 2023-09-23 16:32 GMT

న్యూఢిల్లీ: హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జేడీ(ఎస్).. కర్ణాటకలో బీజేపీతో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పొత్తు గురించి జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించిన తర్వాత సీనియర్ ముస్లిం నేతలు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మాజీ మంత్రి ఎన్‌ఎం నబీ, న్యూఢిల్లీ మాజీ ప్రతినిధి మొహిద్ అల్తాఫ్, యూత్ వింగ్ చీఫ్ ఎన్‌ఎం నూర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ షఫివుల్లా, మైనారిటీ విభాగం మాజీ చీఫ్ నాసిర్ హుస్సేన్ ఉస్తాద్ రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు షఫివుల్లా తన రాజీనామాకు గల కారణాలను లేఖలో పేర్కొన్నారు.

‘మా పార్టీ లౌకిక ప్రమాణాలపై నిలబడటం వల్లే సమాజానికి, కమ్యూనిటీకి సేవ చేసే ఉద్దేశ్యంతో పార్టీలో కష్టపడి పనిచేశాను. మా నాయకుడు కుమారస్వామి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీతో చేతులు కలిపినప్పుడు మాత్రమే పార్టీకి దూరంగా ఉన్నాను. పార్టీ సీనియర్ నాయకులు మళ్లీ ఇప్పుడు బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు కాబట్టి నాకు రాజీనామా తప్ప మరో మార్గం లేదు’ అని తెలిపారు.


Similar News