One Nation, One Election: 'రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం'.. ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ పై సీఈసీ రాజీవ్ కుమార్

Update: 2023-09-06 16:31 GMT

భోపాల్: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పై దేశవ్యాప్తంగా డిబేట్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దానిపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ స్పందించారు. త్వరలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ పరిపాలనాధికారులు, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పై మీడియా ప్రశ్నించగా.. తాము రాజ్యాంగ నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే పనిచేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ లేదా లోక్ సభ గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించడం తమ కర్తవ్యమని చెప్పారు. ఈ గడువు ముగియడానికి 6 నెలల ముందు కూడా ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు తమకు ఉందన్నారు.

ఈ-ఓటింగ్ ప్రక్రియ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందని మీడియా అడగగా.. ‘‘ఈ ప్రక్రియ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందనే ఆందోళన కొందరిలో ఉంది. అందుకే దాన్ని అమల్లోకి తేవడానికి ఇంకా సమయం పడుతుంది’’ అని తెలిపారు. ఈ-ఓటింగ్ ప్రక్రియను అమల్లోకి తేవడానికి సాంకేతిక ఆటంకాలేవీ లేవన్నారు. ప్రస్తుతం అది ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే.. వారి ఇళ్ల నుంచే ఓటు వేయగలిగే వ్యవస్థను వచ్చే ఎన్నికల కోసం రెడీ చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఇలా ఓటు వేయదల్చిన వారు ఆన్ లైన్ ఒక ఫారం భర్తీ చేస్తే సరిపోతుందన్నారు.

ఎన్నికల అధికారులు అలాంటి ఓటర్ల ఇళ్లకు వెళ్లి గోప్యంగా ఓటును సేకరిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియోగ్రాఫ్ చేస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు నామినేషన్ తేదీ నుంచి పోలింగ్ రోజు వరకు వారి ఖర్చుల వివరాలను ట్యాబ్‌లో రెడీగా ఉంచుకోవాలన్నారు. ‘‘ఉచిత హామీలను ప్రకటించే హక్కు రాజకీయ పార్టీలకు ఉంది. అయితే ఆ వాగ్దానాన్ని ఎంతకాలంలో నెరవేరుస్తారు..? దానికోసం ఎంత ఖర్చు చేస్తారు..? అనే దానిపైనా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి’’ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై తాము సవివరమైన నివేదికను తయారు చేశామని, అయితే ప్రస్తుతం ఆ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందన్నారు. జైలు ఖైదీలకు చట్టం ప్రకారం ఓటు వేసే హక్కు లేదన్నారు.


Similar News