Akhilesh Yadav : మాయావతికి మద్దతుగా అఖిలేష్.. బీజేపీ ఎమ్మెల్యే‌ వ్యాఖ్యలపై భగ్గు

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త సీన్ కనిపించింది.

Update: 2024-08-24 14:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త సీన్ కనిపించింది. బీఎస్పీ అధినేత్రి మాయావతికి మద్దతుగా సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ చౌదరిపై పరువు నష్టం కేసును నమోదు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని అఖిలేష్ డిమాండ్ చేశారు. ‘‘సమాజ్‌వాదీ, బీఎస్పీల మధ్యనున్న రాజకీయ వైరుధ్యాలు అనేవి వేరే అంశం. కానీ ఒక మహిళగా మాయావతి ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా మాయావతిపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదు. అన్ని ఎన్నికల్లోనూ ఆమె ప్రజల మద్దతుతో గెలిచారే తప్ప, బీజేపీ మద్దతుతో అధికారంలోకి రాలేదు’’ అని స్పష్టం చేశారు.ఈమేరకు సోషల్ మీడియా వేదికగా అఖిలేష్ ఒక పోస్ట్ చేశారు. మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ చౌదరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వీడియో క్లిప్‌ను తన పోస్ట్‌లో సమాజ్‌వాదీ చీఫ్ జతపరిచారు. ‘‘మాయావతి ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు సీఎంగా సేవలందించారు. ఆమెను తొలిసారి సీఎంగా చేసింది బీజేపీయే. మా పార్టీ చేసిన తప్పు అదే’’ అని రాజేశ్ చౌదరి కామెంట్ చేసినట్లుగా ఆ వీడియోలో ఉంది. ‘‘ఉత్తరప్రదేశ్‌లో అత్యంత అవినీతిమయ సీఎం మాయావతియే’’ అని కూడా సదరు బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.


Similar News