Rajnath Singh: ఉగ్రదాడులు దురదృష్టకరం .. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.

Update: 2024-11-02 09:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu kashmir)లో జరుగుతున్న ఉగ్రదాడులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) స్పందించారు. ఇటీవల జరిగిన టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని తెలిపారు. సరిహద్దుల్లో భద్రతా లోపం లేదని, ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని స్పష్టం చేశారు. శనివారం ఆయన ఉత్తరప్రదేశ్‌(Utharapradesh)లోని కాన్పూర్‌లో మీడియాతో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఉగ్రవాద ఘటనలు తగ్గాయని తెలిపారు. సైన్యం సైతం పూర్తి అప్రమత్తంగా ఉందని, ఉగ్రదాడులను ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పారు. అయితే రానున్న కాలంలో కశ్మీర్‌లో ఉగ్రఘటనలు పూర్తిగా ముగిసిపోయే పరిస్థితులు తలెత్తుతాయని, కేంద్రపాలిత ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని నొక్కి చెప్పారు.

భారత్‌-చైనా(India-china) సరిహద్దుల్లో పెట్రోలింగ్‌ ప్రారంభించడం, దీపావళి సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేయడంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. భారత్‌ తన పొరుగు దేశాలన్నింటితోనూ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటోందన్నారు. భారత్‌-చైనాల మధ్య ఏడాదిన్నరగా నిరంతరం చర్చలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం చివరకు ఒక పరిష్కారం దొరికిందని చెప్పారు. కాగా, జమ్మూ కశ్మీర్ లో గత 36 గంటల్లోనే మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి. శ్రీనగర్‌లోని ఖన్యార్‌(Kanyar), బందిపొరాలోని పన్నెర్‌(panner), తాజాగా అనంత్‌నాగ్‌ (Ananthanag)లో ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.

Tags:    

Similar News