India Inc: ఉగ్రవాదుల దాడిని ఖండించిన భారతీయ కంపెనీలు

పరిశ్రమ సంఘాలు, పలువురు కంపెనీల అధినేతలు ప్రజలు, ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు.

Update: 2025-04-23 16:45 GMT
India Inc: ఉగ్రవాదుల దాడిని ఖండించిన భారతీయ కంపెనీలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడంపై దేశీయ వ్యాపార వర్గాలు తీవ్ర విచారం, వేదనను వ్యక్తం చేశాయి. దేశంలో శాంతి, సమగ్రతకు ముప్పు కలిగించేందుకు చేసిన ఈ దాడులను 'అత్యంత హేయమైనదని' కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ సందర్భంగా పరిశ్రమ సంఘాలు, పలువురు కంపెనీల అధినేతలు ప్రజలు, ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు. ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనేందుకు, జీవినోపాధికి, ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నిలబడగల సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. 'పెహల్‌గామ్‌లో జరిగిన ఘటన కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్టు' ఆతిథ్య సేవల కంపెనీ ఓయో వ్యవస్థాపకుడు, సీఈఓ రితేష్ అగర్వాల్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ భయంకరమైన దాడి పట్ల మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను, దుఃఖాన్ని చెరపలేం. ఈ దారుణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు పరిశ్రమల సంఘం ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. సమాజంలో హింసకు చోటు లేదన్న విశ్వాసంతో ఉన్నామని, సమిష్టిగా సంకల్పం ఉండటం వల్లనే దేశం ఇటువంటి సవాళ్లను అధిగమించగలదని ఫిక్కీ పేర్కొంది. అమాయక ప్రజలను, ప్రధానంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ తెలివితక్కువ హింస విలువైన ప్రాణాలను బలిగొనడమే కాకుండా, ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సుకు ముప్పు కలిగిస్తుందని సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పురి పేర్కొన్నారు. 

Tags:    

Similar News