Robert vadra: పహెల్గాం దాడి ప్రధానికి సందేశం.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
పహెల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ-ముస్లిం ఘర్షణ జరుగుతోందని, దీని వల్ల ముస్లింలు అసౌకర్యంగా ఉన్నారని భావిస్తున్నారని తెలిపారు. అందుకే ఉగ్రవాదులు గుర్తింపు అడిగిన తర్వాత ప్రజలను చంపుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హిందుత్వా్న్ని ప్రోత్సహించడం కూడా దీనికి కారణమని తెలిపారు. ప్రభుత్వం తరచుగా హిందూత్వం గురించి మాట్లాడుతుందని దీనివల్ల మైనారిటీ సమాజం అసౌకర్యానికి, ఆందోళనకు గురవుతుందని పేర్కొన్నారు. ఉగ్రవాద ఘటనను పరిశీలిస్తే దేశంలో హిందువులు, ముస్లింల మధ్య విభజన జరిగినట్టు కనిపిస్తోందన్నారు.
ఉగ్రవాదులు తమ గుర్తింపులను తనిఖీ చేసి హిందువులను చంపడం అంటే ప్రధాని మోడీకి కూడా ఓ సందేశం ఇవ్వడం లాంటిదని అభిప్రాయపడ్డారు. దేశంలో మనం లౌకికంగా ఉన్నామని భావిస్తున్నట్టు ప్రకటన రావాలని అప్పుడు మాత్రమే ఉగ్రదాదులను ఆపగలమని తెలిపారు. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. రాబర్ట్ వాద్రా ఉగ్రవాద చర్యను సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులను ఖండించడానికి బదులుగా వారికి రక్షణ కల్పిస్తున్నారని, అంతేగాక పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దురాగతాలకు భారతదేశంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.