Rajnath singh: హేమంత్ సోరెన్ అత్యంత అవినీతిపరుడు.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

జార్ఖండ్ సీఎంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు.హేమంత్ సోరెన్ అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు.

Update: 2024-09-21 13:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ సీఎంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. హేమంత్ సోరెన్ అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. భారతదేశ ప్రజాస్వామ్య పద్దతులలో ఆడుకున్నాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని ఇత్ఖోరీలో శనివారం నిర్వహించిన బీజేపీ పరివర్తన్ యాత్రలో ఆయన ప్రసంగించారు. హేమంత్ అవినీతి పరుడని జార్ఖండ్ ప్రజలు ఆయనను గద్దె దించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గత బీజేపీ ముఖ్యమంత్రులు బాబూలాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘుబర్ దాస్‌లు ఎప్పుడూ అవినీతి ఆరోపణలను ఎదుర్కోలేదని గుర్తు చేశారు. హేమంత్ చర్యలను భారత్ ఎప్పటికీ క్షమించబోదని స్పష్టం చేశారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ న్యాయ పరమైన పాలనను అందిస్తోందని తెలిపారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. ఆయన విదేశాల్లో భారదేశ ప్రతిష్టను దిగజార్చారని ఫైర్ అయ్యారు. సిక్కు సమాజానికి భారత్ సురక్షితం కాదని చెప్పి వారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రధాని మోడీ హయాంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. 


Similar News