రాహుల్ వర్సెస్ మోడీ.. ‘హిందుత్వం’పై లోక్‌సభలో వాడివేడి చర్చ

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ సమావేశాలు సోమవారం రోజు వాడివేడిగా జరిగాయి.

Update: 2024-07-01 18:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ సమావేశాలు సోమవారం రోజు వాడివేడిగా జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌‌లపై ధ్వజమెత్తారు. ‘‘తమను తాము హిందువులుగా చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ నేతలు నిత్యం హింస, విద్వేషం గురించే మాట్లాడుతుంటారు. వాళ్లు నిజమైన హిందువులు కాదు’’ అని రాహుల్‌ కామెంట్ చేశారు. ‘‘నరేంద్ర మోడీ అంటే మొత్తం హిందూ సమాజం కాదు. బీజేపీ అంటే మొత్తం హిందూ సమాజం కాదు. ఆర్ఎస్ఎస్ అంటే మొత్తం హిందూ సమాజం కాదు. హిందుత్వం అనేది బీజేపీకి మాత్రమే సొంతమైన ఆస్తేం కాదు’’ అని కాంగ్రెస్ అగ్రనేత విమర్శించారు. ‘‘కొందరికి ఒక చిహ్నం అంటే భయం. అదే అభయహస్తం. కాంగ్రెస్ గుర్తు’’ అని రాహుల్ చెప్పారు. శివుడి ఫొటో, ఇతర మతపరమైన ఫొటోలను పట్టుకొని సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించడాన్ని స్పీక‌ర్ ఓం బిర్లా తప్పుపట్టారు. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవన్నారు. ఈక్రమంలో కలుగజేసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘యావ‌త్ హిందూ స‌మాజం హింసాత్మ‌కంగా, విద్వేషపూరితంగా ప్రవర్తిస్తుందని రాహుల్ అంటున్నారు. అలా మాట్లాడటం తీవ్ర‌మైన అంశం’’ అని పేర్కొన్నారు.

అభయ ముద్ర గురించి మాట్లాడే అర్హత లేదు : అమిత్‌షా

ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ బదులిస్తూ.. ‘‘నేను కేవలం బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాను. హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదు. హిందూ సమాజం అంటే కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే అనుకుంటే ఎలా ?’’ అని తెలిపారు. అన్ని మతాలు కూడా ధైర్యం, నిర్భయత, అహింసా సందేశాలనే ఇస్తాయన్నారు. ఆ వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందిస్తూ.. వెంటనే విపక్ష నేత రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘1975లో ఎమర్జెన్సీ విధించి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది కాంగ్రెస్ పార్టీయే.. ఆ పార్టీకి అభయ ముద్ర గురించి మాట్లాడే అర్హత లేదు. 1984లో ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు చేయించి ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీయే. వాళ్లకు అహింస గురించి మాట్లాడే హక్కు లేదు’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.

ప్రజల భూములను లాక్కొని అయోధ్య ఎయిర్‌పోర్టు కట్టారు : రాహుల్

తన పక్కనే కూర్చున్న ఫైజాబాద్ (అయోధ్య) ఎంపీ అవధేష్ ప్రసాద్‌ను చూపిస్తూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య ఈసారి మీకు సరైన సందేశం ఇచ్చింది. మీరు అక్కడి ప్రజల భూములు లాక్కొని ఎయిర్ పోర్టు నిర్మించారు. ఇప్పటిదాకా వాళ్లకు పరిహారం కూడా ఇవ్వలేదు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో మోడీజీతో పాటు అదానీ, అంబానీ ఉన్నారు. కానీ అయోధ్య ప్రజలు మాత్రం లేరు’’ అని ఆయన ఆరోపించారు. ‘‘ప్రధాని మోడీజీ ఈసారి అయోధ్య నుంచి పోటీ చేద్దామని అనుకున్నారు. రెండుసార్లు సర్వే చేయిస్తే.. అక్కడ పోటీ చేస్తే ఓడిపోతారని తేలింది. దీంతో సేఫ్‌గా వారణాసి నుంచే పోటీ చేశారు. బీజేపీ సర్కారు విధానాలతో విసిగి వేసారిన అయోధ్య ప్రజలు బీజేపీకి తగిన శాస్తి చేశారు’’ అని రాహుల్ విమర్శించారు.

ఛాలెంజ్.. గుజరాత్ ఎన్నికల్లో గెలవబోయేది మేమే : రాహుల్

‘‘సభాపక్ష నేత అయిన ప్రధాని మోడీ విపక్షంతో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన దాఖలాలే లేవు. మేం ఎదురుపడినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించదు. మోడీజీ ఎందుకో ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు?’’ అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. దీనికి ప్రధాని వెంటనే బదులిస్తూ.. ‘‘ప్రతిపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పించాయి’’ అని పేర్కొన్నారు. దీంతో అధికార పక్షం సభ్యులంతా నవ్వులు చిందించారు. ఇక ప్రధాని మోడీకి రాహుల్‌ గాంధీ ఓ బహిరంగ సవాల్‌ విసిరారు. ‘‘నేను గుజరాత్‌‌కు వెళ్లి టెక్స్‌టైల్‌ పరిశ్రమల యజమానులతో మాట్లాడాను. నోట్ల రద్దు, జీఎస్‌టీని ఎందుకు తీసుకొచ్చారని వారిని అడిగాను. అవి బిలియనీర్ల కోసమేనని వాళ్లు చెప్పారు. నేను చెప్పేది రాసిపెట్టుకోండి వచ్చే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతోంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.

నేనూ వేధింపులకు బాధితుడినే : రాహుల్

‘‘బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాదిమందిపై గత పదేళ్లలో దాడి జరిగింది. నేనూ ఒక బాధితుడినే. నాపై 20కిపైగా కేసులను మోపారు. రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ వాళ్లు 55 గంటల పాటు విచారించారు’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. అధికారంలో ఉండటం కంటే ఇదే ఎక్కువ విలువైనదని, ఇందులో ‘సత్యం’ ఉందని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంలో నీట్‌, అగ్నివీర్‌ల ప్రస్తావన లేదు. ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన ‘నీట్‌’ను కమర్షియల్‌గా మార్చారు. రైతు చట్టాల వల్ల 700 మంది అన్నదాతలు చనిపోతే.. సభలో కనీసం మౌనం పాటించలేదు. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధాని చెప్పారు. అల్లర్లతో అట్టుడికిన మణి‌పూర్‌కు ఇప్పటివరకు ప్రధాని వెళ్లలేదు. అక్కడ నా కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఇవన్నీ దేశ ప్రజలకు లాభం చేకూరుస్తాయా ?’’ అని రాహుల్ ప్రశ్నించారు. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ స్కీంను ‘యూజ్‌ అండ్‌ త్రో లేబర్‌’ పథకంగా రాహుల్‌‌గాంధీ అభివర్ణించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్.. ప్రతిపక్షనేత ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ స్పందిస్తూ.. ‘‘మీరు సైనికులను విభజిస్తున్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఒకరిని అమరుడు అంటున్నారు. మరొకరిని అగ్నివీరుడు అంటున్నారు. అగ్నివీరుడు జవాన్‌గా పిలిపించుకోలేడు. మీరన్నట్లుగా అతడు దేశభక్తుడిగానే మిగిలిపోతాడు’’ అంటూ అధికార పక్షంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైక్‌లను నేను కట్ చేయను : స్పీకర్

అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా స్పీకర్ ఓంబిర్లా కలుగజేసుకొని పార్లమెంటు సభ్యుల మైక్‌లను కట్ చేసే అంశంపై స్పష్టత ఇచ్చారు. మైక్‌లను కట్ చేస్తున్నానంటూ తనపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. సభ్యుల మైక్‌లను ఆపరేట్‌ చేసేందుకు తన దగ్గర ఎలాంటి రిమోట్‌ కంట్రోల్స్‌ లేవని తేల్చి చెప్పారు. సభాపతి గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.

అవసరమైతే నేను పెద్దల కాళ్లకు కూడా నమస్కరిస్తాను : స్పీకర్

‘‘సభ ప్రారంభమయ్యే టైంలో ప్రధాని మోడీ రాగానే మీరు ఎందుకలా వంగిపోయారు ? నా వంతు రాగానే మీరు నార్మల్ అయిపోయారు కదా’’ అని రాహుల్ ప్రశ్నించగా స్పీకర్ ఓంబిర్లా బదులిచ్చారు. ‘‘ప్రధానమంత్రి అంటే ఈ సభాధినేత. అంతేకాకుండా మోడీజీ వయసులో నా కన్నా పెద్దవారు. అందుకే గౌరవమివ్వాలన్న ఉద్దేశంతోనే అలా వంగి నమస్కారం పెట్టాను. అవసరమైతే నేను కాళ్లకీ నమస్కరిస్తాను. పెద్ద వాళ్లను అలా గౌరవించుకోవడం నా సంస్కారం’’ అని స్పీకర్ స్పష్టం చేశారు. స్పీకర్ అభిప్రాయాలను గౌరవిస్తానన్న రాహుల్.. సభలో స్పీకర్‌ కన్నా పెద్ద వాళ్లు ఎవరూ ఉండరన్నారు. స్పీకర్ ముందు సభ్యులంతా వినమ్రంగా ఉండాలని సూచించారు. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరి ముందూ అలా తల వంచకూడదని పేర్కొన్నారు.

నేడు సభలో ప్రధాని మోడీ ప్రసంగం

రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చ మంగళవారం సాయంత్రం వరకు ఉభయ సభల్లో కొనసాగనుంది. సాయంత్రం లోక్‌సభలో చర్చ ముగియగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. ప్రధానంగా విపక్షాల ప్రశ్నలు, వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ ప్రధాని మోడీ ప్రసంగం సాగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్‌ విమర్శించింది బీజేపీనే.. హిందువులను కాదు: ప్రియాంక

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో విమర్శించింది బీజేపీనే తప్ప.. హిందువులను కాదని ప్రియాంకాగాంధీ స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, ఆ విషయాన్ని సభలో రాహుల్‌ స్పష్టంగా చెప్పారన్నారు. హిందువులను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోం మంత్రి డిమాండ్ చేయడం సరికాదన్నారు. 

Similar News