సినిమా తీసేదాకా ఆయనెవరో ప్రపంచానికి తెలియదు- గాంధీపై మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు
మహాత్మా గాంధీపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మన జాతిపిత గాంధీపై సినిమా వచ్చే వరకు ఆయన గురించి ప్రపంచానికి తెలియదని మోడీ కామెంట్స్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహాత్మా గాంధీపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మన జాతిపిత గాంధీపై సినిమా వచ్చే వరకు ఆయన గురించి ప్రపంచానికి తెలియదని మోడీ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గాంధీ గురించి ప్రపంచానికి తెలియజేసే బాధ్యత దేశనాయకులదే అన్నారు. గాంధీ జీవితం, సిద్ధాంతాల గురించి తీసిన మూవీ ఆధారంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు అయితే.. గాంధీని కూడా అలా మార్చేందుకు కృషి చేయాల్సిందన్నారు. మహాత్ముడిపై మరింత దృష్టి సారించి ఉంటే బాగుండేదన్నారు. దేశంలోని ఎన్నో సమస్యలకు గాంధీ దగ్గర పరిష్కారం ఉందన్నారు.
అయితే, మోడీ చేసిన ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. మహాత్ముడి వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించింది. గాంధీ పేరుతో ఉన్న సంస్థలను కేంద్రమే ధ్వంసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ ఎక్స్ లో పోస్టు చేశారు. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్ లో గాంధీ పేరుతో ఉన్న సంస్థలు ధ్వంసం చేశారని మండిపడ్డారు.
మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవాలంటే ‘ఎంటైర్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్’ మాత్రమే మూవీ చూడాలి అని పేర్కొన్నారు. పరోక్షంగా ప్రధాని మోడీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని ఉద్దేశించే ఎంటైర్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అని రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు.
ఇకపోతే, మహాత్ముడి జీవితం ఆధారంగా 1982లో ‘గాంధీ’ చిత్రం వచ్చింది రిచర్డ్ అటెన్‌బరో డైరెక్షన్ వహించిన ఈ మూవీలో బెన్ కింగ్స్లే గాంధీపాత్రలో నటించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో ఆ మూవీకి అకాడమీ అవార్డులు వచ్చాయి.