Amaran: అమరన్ సినిమా చూసిన సీఎం.. చిత్ర బృందంపై ప్రశంసల జల్లు
తమిళనాడు సీఎం స్టాలిన్ అమరన్ సినిమా చూశారు. సినిమాను చాలా బాగా తెరకెక్కించారని చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: మేజర్ ముకుంద్ వరదరాజన్ (Major Mukund Varada Rajan) నిజజీవితం ఆధారంగా.. శివకార్తికేయన్ - సాయిపల్లవి జంటగా.. రాజ్ కుమార్ పెరియాసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అమరన్ (Amaran). ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. హే రంగులే పాటతో, ట్రైలర్ తో అంచనాలు పెంచుకున్న అమరన్ (Amaran Review).. ప్రీమియర్ షో తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ ఆర్మీ జర్నీ, పర్సనల్ లైఫ్ జర్నీ, అతని వీరమరణం అంశాలతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మరోసారి ఏడ్పించింది. మేజర్, సీతారామం తర్వాత.. ప్రేక్షకుల్ని ఏడిపించిన సినిమా ఇదే.
తాజాగా ఈ సినిమాను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) వీక్షించారు. సినిమా చాలా బాగుందని, 2014లో మిలిటెంట్ ఆపరేషన్లో దేశభద్రత కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని చాలా చక్కగా తెరకెక్కించారని చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. మిలటరీలో ఉన్నవారంతా నిజమైన హీరోలని కొనియాడారు. వారి జీవితాల ఆధారంగా ఇలాంటి సినిమాలను తీయడం అభినందనీయమని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఇక ప్రేక్షకులైతే సినిమాకు చాలా కనెక్టైనట్లు తెలుస్తోంది. శివకార్తికేయని, సాయిపల్లవి తమ పాత్రల్లో ఒదిగిపోయారని, కమల్ హాసన్ కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారని చెబుతున్నారు.