Rahul Gandhi: ఆయన బౌన్సర్ లా ప్రవర్తించారు- రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు
రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి(BJP MP Pratap Chandra Sarangi) విమర్శలు గుప్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి(BJP MP Pratap Chandra Sarangi) విమర్శలు గుప్పించారు. ఆయనో బౌన్సర్ లా ప్రవర్తించారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన రాహుల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు “పార్లమెంట్ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్‌సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారు. అలాంటి పదవిలో కొనసాగుతున్న రాహుల్ ఇంత దారుణంగా ప్రవర్తించడం సరైనది కాదని అన్నారు. తోపులాటలో గాయపడిన నేను డిసెంబరు 28న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. తలపై పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నా” అని సారంగి చెప్పుకొచ్చారు. జరిగిన విషయాన్ని ఎవరో తెలియజేసిన తర్వాత రాహుల్ తన దగ్గరకు వచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆయన తన దగ్గరకి వచ్చి త్వరగానే వెళ్లిపోయినట్లు వెల్లడించారు. జగన్నాథుని ఆశీస్సుల వల్లే తాను త్వరగా కోలుకున్నట్లు తెలిపారు.
పార్లమెంటు సమవేశాలు
శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో డిసెంబర్ 19న ఎంపీల మధ్య తోపులాట (Parliament scuffle) జరిగింది. ఆ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పూత్ గాయపడిడారు. కాంగ్రెస రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ని అవమానిస్తున్నట్లు బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పక్కనుంచి వెళ్లే అవకాశమున్నా.. మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ సభలోకి వెళ్లడానికి ప్రయత్నించారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాను సభలోకి వెళ్తుంటే వారే అడ్డుగా వచ్చి నెట్టేశారని రాహుల్ ఆరోపించారు.