Hindenburg : ప్రధాని ఎందుకు భయపడుతున్నారో అర్థమైంది : రాహుల్ గాంధీ

దిశ, నేషనల్ బ్యూరో : సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ బుచ్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సమగ్రతపై ఆందోళనలు రేకెత్తాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్షనేత రాహుల్ గాంధీ విమర్శించారు.

Update: 2024-08-11 17:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ బుచ్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సమగ్రతపై ఆందోళనలు రేకెత్తాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్షనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో దర్యాప్తు చేయించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు భయపడుతున్నారు అనేది హిండెన్‌బర్గ్ నివేదికలోని అంశాలతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఒకవేళ జేపీసీతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటపడతాయనే విషయం ప్రధానికి బాగా తెలుసని రాహుల్ చెప్పారు. ‘‘దేశంలోని చిన్నతరహా రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను రక్షించాల్సిన బాధ్యత సెబీపై ఉంటుంది. అలాంటి సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉన్న వ్యక్తిపైనే ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల సంపదకు లభిస్తున్న భద్రతపై సందేహాలు రేకెత్తుతున్నాయి’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆదివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు.

‘సెబీ ఛైర్‌పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదు ?’

ఆరోపణలు చుట్టుముట్టినా ఇప్పటిదాకా సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పురి బుచ్ ఎందుకు రాజీనామా చేయలేదనే విషయాన్ని దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజలు కష్టపడి సంపాదించి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టిన డబ్బులను ఒకవేళ కోల్పోతే ఎవరు బాధ్యులు .. ప్రధాని మోడీయా, సెబీ ఛైర్‌పర్సనా ? గౌతమ్ అదానీయా ?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్ నివేదికలో సంచలన ఆరోపణలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగా విచారణకు స్వీకరిస్తుందా అని ఆయన అడిగారు. కాగా, హిండెన్‌బర్గ్ సంస్థపై భారత దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం విచారణ చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది తెలిపారు. దేశ ఆర్థిక రంగంలో భయాందోళనలను క్రియేట్ చేయాలనేది విపక్ష పార్టీల ఎజెండా అనే విషయం ప్రస్తుత పరిణామాలతో స్పష్టం అవుతోందన్నారు. సెబీ ఛైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల్లో వాస్తవికత లేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News