Putin modi: పుతిన్‌కు మోడీ ఫోన్.. ఉక్రెయిన్ పర్యటనపై డిస్కషన్!

ప్రధాని నరేంద్ర మోడీరష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Update: 2024-08-27 15:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవలి ఉక్రెయిన్ పర్యటనపై మోడీ పుతిన్‌కు తెలియజేశారు. ఉక్రెయిన్‌తో వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి చర్చలు, దౌత్యమే మార్గమని పుతిన్‌కు సూచించినట్టు తెలుస్తోంది. అంతేగాక భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్టు మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. స్థిరమైన, శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

అనంతరం క్రెమ్లిన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా యుద్ధానికి పరిష్కారం తీసుకురావడానికి మోడీ తన నిబద్ధతను నొక్కిచెప్పారని పేర్కొంది. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడడం రెండు నెలల్లోనే ఇది రెండోసారి. అంతకుముందు జూలై 8న మోడీ రష్యాలో పర్యటించారు. అప్పుడు కూడా ఈ విషయంపై చర్చించారు. పుతిన్ తో మాట్లాడే ఒక రోజు కన్నా ముందే మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తోనూ ఉక్రెయిన్ విషయంపై మాట్లాడటం గమనార్హం. దీంతో గంటల వ్యవధిలోనే ఇద్దరు దేశాధినేతలతో మోడీ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది.


Similar News