డ్రగ్స్ కేసులో పంజాబ్ ఎంపీ సోదరుడు అరెస్టు

పంజాబ్ ఎంపీ, ఖలిస్థానీ మద్దతుదారులు అమృత్ పాల్ సింగ్ సోదరుడు హర్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు.

Update: 2024-07-12 08:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ ఎంపీ, ఖలిస్థానీ మద్దతుదారులు అమృత్ పాల్ సింగ్ సోదరుడు హర్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. పంజాబ్ లోని జలంధర్ లో పోలీసులు అతడ్ని డ్రగ్స్ తో అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఫిలింనగర్ సమీపంలోని జలంధర్-పానిపట్ జాతీయ రహదారిపై 4 గ్రాముల డ్రగ్స్ తో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆముగ్గురిలో అమృత్ పాల్ సోదరుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు, సాధారణ నిఘాలో ఉన్న పోలీసు బృందం ముగ్గురి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు జలందర్ రూరల్ సీనియర్ అధికారి అంకుర్ గుప్తా తెలిపారు. నిందితుల నుంచి 4 గ్రాముల ఐసీఈ, డిజిటల్ వేయింగ్ స్కేల్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వైద్య నివేదికల ప్రకారం హర్‌ప్రీత్, లవ్ ప్రీత్ ఇద్దరికీ డోప్ టెస్టు పాజిటివ్ తేలిందన్నారు. వీరిద్దరూ లూథియానాకు చెందిన సందీప్ అరోరా నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే సందీప్ అరోరా డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో పలుమార్లు అరెస్టు అయినట్లు తెలిపారు. ఇకపోతే, లోక్ సభ ఎన్నికల్లో శ్రీ ఖదూర్ సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి అమృత్ పాల్ సింగ్ ఎంపీగా గెలుపొందారు. ఎన్నికల్లో భాగంగా డ్రగ్స్ నిర్మూలనే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. కాగా, డ్రగ్స్ కేసులోనే ఆయన సోదరుడు అరెస్టు కావడం గమనార్హం.


Similar News