Delhi March : రేపు మళ్లీ రైతుల ‘ఢిల్లీ మార్చ్’.. 101 మంది రైతుల బృందం రెడీ
దిశ, నేషనల్ బ్యూరో : ‘ఢిల్లీ మార్చ్’(Delhi March) నిర్వహించే విషయమై పంజాబ్ రైతు నేత సర్వన్ సింగ్ పంధేర్ కీలక ప్రకటన చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ‘ఢిల్లీ మార్చ్’(Delhi March) నిర్వహించే విషయమై పంజాబ్ రైతు నేత సర్వన్ సింగ్ పంధేర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకైతే చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు పిలుపు రాలేదని ఆయన స్పష్టంచేశారు. రైతుల(Farmers protest)తో చర్చలు జరిపే మూడ్‌లో మోడీ సర్కారు కనిపించడం లేదన్నారు. 101 మంది రైతులతో కూడిన బృందం ఆదివారం (డిసెంబరు 8న) మధ్యాహ్నం శాంతియుతంగా ఢిల్లీ(Delhi) మార్చ్‌ను ప్రారంభిస్తుందని సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఈమేరకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్జూర్ మోర్చాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. పంజాబ్ - హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఇటీవలే ఢిల్లీ మార్చ్‌కు బయలుదేరిన రైతులపై హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ఈ ఘటనలో 16 మంది రైతులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరు వినికిడి శక్తిని కోల్పోయారు’’ అని సర్వన్ సింగ్ చెప్పారు. 12 మంది రైతులు చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మిగతా నలుగురికి చికిత్స కొనసాగుతోందన్నారు. రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ మోడీ సర్కారు నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటోందని ఆయన విమర్శించారు. ఇక మరో రైతు నేత జగ్జిత్ సింగ్ దలేవాల్ పంజాబ్‌లోని ఖానౌరీ బార్డర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష వల్ల ఆయన బరువు దాదాపు 8 కేజీలు తగ్గిపోయింది.