Kota: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో ఘటన
జేఈఈ, నీట్ పరీక్షల కోచింగ్ హబ్‌గా భావించే రాజస్థాన్ లోని కోటా నగరంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, నేషనల్ బ్యూరో: జేఈఈ(Jeet), నీట్ (Neet) పరీక్షల కోచింగ్ హబ్‌గా భావించే రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (Kota) నగరంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన అభిషేక్ లోధా (20) గతేడాది మే నుంచి కోటాలో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి తను నివాసముండే గదిలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాప్తు చేపట్టారు. స్టూడెంట్ రూంలో ఓ సూసైడ్ నోట్ గుర్తించారు. ‘నేను చదువుకోలేకపోతున్నాను. జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నా. కానీ అది నా శక్తికి మించినది. నన్ను క్షమించండి’ అని విద్యార్థి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు రోజు హర్యానాలోని మహేంద్రగఢ్‌కు చెందిన నీరజ్ కూడా జవహర్ నగర్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో 24 గంటల్లోనే రెండో కేసు నమోదు కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అన్ని హాస్టళ్లు, గదుల్లో హ్యాంగింగ్ డివైజ్‌ల ఏర్పాటుకు సంబంధించి జిల్లా యంత్రాంగం కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎవరూ ఆదేశాలను పాటించడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాగా, గతేడాది కోటాలో 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.