Freebies: ఉచితాలు లేదా మెరుగైన సౌకర్యాలు.. ప్రజలే నిర్ణయించాలి: ఆర్థికవేత్త అరవింద్ పనగరియా
దేశంలో ఖర్చులకు సంబంధించి ఎన్నికైన ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలకు సంబంధించి ఆర్థికవేత్త, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందంతో కలిసి గోవాలోని ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రజలకు ఉచితాలు కావాలో, మెరుగైన రోడ్లు, మంచి డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన నీటి సరఫరా కావాలో నిర్ణయించుకోవాలని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను రాష్ట్రాలు ఉచిత పథకాల పంపిణీకి వినియోగిస్తున్నాయనే అంశంపై స్పందిస్తూ పనగరియా పవ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులకు ఇచ్చిన సొమ్మును ఆ పనులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ, ప్రజాస్వామ్య దేశంలో ఖర్చులకు సంబంధించి ఎన్నికైన ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఆర్థిక సంఘం ఈ విషయంపై నిర్ణయం తీసుకోదు. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం ఈ సమస్యను ప్రస్తావించగలదే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఖర్చు చేయాలనే అంశాన్ని నియంత్రించలేమన్నారు. ఆయా ప్రభుత్వాలను ఎన్నుకునే బాధ్యత చివరకు ప్రజలదే కాబట్టి, ఉచితాలు కావాలా లేక మెరుగైన రోడ్లు, నీటి సరఫరా, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కావాలా అనేది వారే నిర్ణయించుకుంటారు. ఉచితాల కోసం ఓట్లు వేస్తే గనక ప్రజలు ఉచితాలనే ఆశిస్తున్నట్టు అర్థం చేసుకోవాలన్నారు.