హర్యానాలో రైతుల రాస్తారోకో.. ఢిల్లీ వెళ్లే హైవే దిగ్బంధం

పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ)ను పెంచాలంటూ హర్యానా రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు.

Update: 2023-06-12 14:47 GMT

న్యూఢిల్లీ: పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ)ను పెంచాలంటూ హర్యానా రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు. కురుక్షేత్ర జిల్లా పిప్లి గ్రామంలో జరిగిన ‘మహా పంచాయత్’లో తీసుకున్న నిర్ణయం మేరకు ఢిల్లీ వెళ్లే జాతీయ రహదారిని దిగ్బంధించారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు నాయకులు పిప్లి ధాన్య మార్కెట్ వద్దకు చేరుకొని ‘ఎంఎస్ పీ దిలావో.. కిసాన్ బచావో’ (కనీస మద్దతు ధర ఇప్పించండి.. రైతును కాపాడండి) అని నినదిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రద్దీని నివారించేందుకు ఢిల్లీ-చండీగఢ్ మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం ప్రకటించిన కనీస మద్దతు ధర పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

36,414 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పువ్వు పండించిన 8,528 మంది రైతులకు మధ్యంతర ‘భార్పై’ (పరిహారం) కోసం రూ.29.13 కోట్లను డిజిటల్ రూపంలో సీఎం ఖట్టర్ విడుదల చేశారు. దీని ప్రకారం పొద్దు తిరుగుడు పువ్వును కనీస మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించే రైతుకు రాష్ట్ర ప్రభుత్వం క్విటాల్ కు రూ.1,000 చొప్పున మధ్యంతర ‘భార్పై’ చెల్లిస్తుంది. ఈ పరిహారం సరిపోదని, పొద్దు తిరుగుడు పంటను క్వింటాల్ కు రూ.6,400 చొప్పున కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు నిర్వహించిన ‘మహా పంచాయత్’కు రైతు నాయకుడు రాకేష్ తికాయత్ హాజరయ్యారు. భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ గుర్నామ్ సింగ్ చారుణి నేతృత్వంలో రైతులు ఈ నెల 6వ తేదీన కూడా జాతీయ రహదారిని దిగ్బంధించారు. వాటర్ కెనాన్లు, లాఠీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు 9 మంది రైతు నాయకులను అరెస్టు చేశారు.


Similar News