Protest: బ్రాంఫ్టన్‌ ఆలయంపై దాడి.. ఢిల్లీలోని కెనడా ఎంబసీ వద్ద భారీ నిరసన

ఈ నెల 3న కెనడాలోని బ్రాంఫ్టన్ నగరంలో ఉన్న హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతు దారులు దాడి చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-11-10 12:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 3న కెనడాలోని బ్రాంఫ్టన్ నగరం(Bramftan City)లో ఉన్న హిందూ ఆలయంపై ఖలిస్థానీ(Kalisthanee) మద్దతు దారులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను నిరసిస్తూ ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం వద్ద హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్(Hindu sikh Global Forum) కార్యకర్తలు ఆదివారం నిరసన చేపట్టారు. కెనడాలో హిందువులపై ఖలిస్థానీ తీవ్రవాదులు హింసకు పాల్పడుతున్నారని, దీనిని వెంటనే ఆపాలని నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ కార్యకర్తలు, గ్లోబల్ ఫోరం సభ్యులు భారీగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. కెనడా ఎంబసీ వద్ద భారీగా బలగాలను మోహరించారు.

ఈ సందర్భంగా హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడు తర్విందర్ సింగ్ మార్వా (Tharvinder singh marvaa) మాట్లాడుతూ.. హిందూ, సిక్కు వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. హిందువులు, సిక్కులు ఐక్యంగా ఉన్నారని, కెనడాలో దేవాలయాలను అపవిత్రం చేస్తే భారతీయులు సహించబోరని హెచ్చరించారు. నిజమైన సిక్కులు ఎప్పటికీ ఖలిస్థానీ కాలేడని, వారికి ప్రత్యేక దేశం కావాలంటే ఆ డిమాండ్ వారికే పరిమితం చేయాలన్నారు. భారతదేశంలోని సిక్కులు దేశానికి అండగా నిలుస్తారని, వేర్పాటు వాదానికి మద్దతు ఇవ్వబోరని తెలిపారు.

Tags:    

Similar News