రైలు ప్రమాదానికి కారణమైన వారిని క్షమించం: ప్రధాని మోడీ
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించారు. ప్రమాదానికి జరిగిన గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో రైలు ప్రమాదం మాటలకందని విషాదం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తునకు ఆదేశించామని, ఈ ఘటనకు బాధ్యులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టబోమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రైలు ప్రమాదంలో గాయపడిన వారిని కటక్ ఆసుపత్రిలో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోడీ.. ఈ రైలు ప్రమాదం తీవ్రంగా కలిచి వేసిందని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ప్రమాదంలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒడిశా సర్కార్ సహాయ చర్యలు చేపట్టిందని ఒడిశా సర్కార్ కు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. క్షతగాత్రుల కోసం చాల మంది యువకులు రక్త దానానికి ముందుకు వచ్చారు. సహాయ చర్యల్లో పాల్గొన్న స్థానికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. వ్యవస్థలను మరింత సురక్షితం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.
ఇవి కూడా చదవండి: