ఔను.. ఎన్నికల ఫలితాలపై నా లెక్క తప్పింది : పీకే

దిశ, నేషనల్ బ్యూరో : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు తప్పాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒప్పుకున్నారు.

Update: 2024-06-07 17:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు తప్పాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒప్పుకున్నారు. ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి సంకోచమూ లేదని ఆయన స్పష్టం చేశారు. తనలా చాలామంది ఎన్నికల వ్యూహకర్తలు కూడా ఫలితాలను అంచనా వేయడంలో పొరపడ్డారని పీకే చెప్పుకొచ్చారు. తాను ఇకపై ఎన్నికల ఫలితాల గణాంకాలపై అంచనాలను చెప్పడం మానేస్తానని ఆయన ప్రకటించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే ఈ వివరాలను వెల్లడించారు. ఈసారి ఎన్నికల ఫలితాలపై అంచనాలను చెప్పేటప్పుడు.. చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా వదిలేశానని ప్రశాంత్ కిశోర్ ఒప్పుకున్నారు. అందువల్లే తాను చెప్పిన అంచనాలకు.. వాస్తవిక ఫలితాలకు పొందిక కుదరలేదన్నారు. ‘‘నేను చెప్పిన దాని కంటే ఎన్నికల ఫలితంలో దాదాపు 20 శాతం తేడా వచ్చింది. బీజేపీకి 300 లోక్‌సభ సీట్లు వస్తాయని చెప్పాను. కానీ వాళ్లకు 240 సీట్లే వచ్చాయి. మోడీ సర్కారుపై కొంత ప్రజాగ్రహం ఉందని నేను చెప్పాను. అయితే మోడీ పనితీరుపై పెద్దగా అసంతృప్తి లేదన్నాను. దానికి ప్రతిబింబం ఎన్నికల ఫలితంలో కనిపించింది’’ అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ‘‘నేను ఒక ఎన్నికల వ్యూహకర్తను. వాస్తవానికైతే నేను సంఖ్యాపరంగా అంచనాలను చెప్పకూడదు. గత రెండేళ్లలో నేను రెండుసార్లు పొరపడ్డాను. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలపై నా అంచనాలు తప్పాయి. గతంలో చాలా లోక్‌సభ ఎన్నికలప్పుడు నేను చెప్పిన అంకెల విషయం తప్పితే.. చెప్పిన మిగతా అంచనాలన్నీ సరైనవే అని తేలింది’’ అని పీకే వివరించారు.


Similar News