అఖిలేష్ యాదవ్ కాబోయే ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను భారతదేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని పేర్కొంటూ కొన్ని పోస్టర్లు లక్నోలో పార్టీ కార్యాలయం వెలుపల కనిపించాయి

Update: 2024-06-29 07:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను భారతదేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని పేర్కొంటూ కొన్ని పోస్టర్లు లక్నోలో పార్టీ కార్యాలయం వెలుపల కనిపించాయి. జులై 1న అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్న పోస్టర్లలో ‘దేశ కాబోయే ప్రధానమంత్రి, గౌరవనీయులైన శ్రీ అఖిలేష్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాసి ఉంది. 2023లో కూడా అఖిలేష్ యాదవ్‌ను "కాబోయే ప్రధానమంత్రి"గా పేర్కొంటూ ఇలాంటి పోస్టర్‌లు వెలువడగా, ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటివి జరగడం గమనార్హం.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాల్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, భారతీయ జనతా పార్టీ 33 స్థానాలు గెలుచుకుంది. అలాగే, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ప్రముఖ నేత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, అఖిలేష్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. మార్చి 2022 నుండి జూన్ 2024 వరకు ఉత్తర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. ఆయన గతంలో 38 సంవత్సరాల వయస్సులో యూపీకి 20వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.


Similar News