కర్నాటకలో రాజకీయ సంక్షోభం.. గవర్నర్‌ నిర్ణయంతో కేబినెట్‌ అత్యవసర భేటీ.!

ముడా కుంభకోణం.. ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది.

Update: 2024-08-17 09:56 GMT

దిశ, వెబ్ డెస్క్: ముడా కుంభకోణం.. ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూముల కేటాయింపు వ్యవహారం.. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17, భారత్ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ కింద సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాలపై కాంగ్రెస్ భగ్గుమంది. కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని.. కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. అయితే ఇదే వ్యవహారంపై చర్చించేందుకు, ఈ సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై సిద్ధరామయ్యతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ మాట్లాడినట్లు సమాచారం. మరొక వైపు సీఎం సిద్ధరామయ్య గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు.

అయితే మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూముల కుంభకోణం విషయంలో, ముగ్గురు వ్యక్తులు గవర్నర్ కు ఫిర్యాదు చేయగా.. ఆ ఫిర్యాదులను స్వీకరించిన గవర్నర్, వాటికి సంబంధించిన విషయంలో సంతృప్తి చెంది.. సీఎం పై విచారణకు అనుమతి మంజూరు చేసినట్లు రాజ్ భవన్ ఒక లేఖను విడుదల చేసింది. కాగా మూడాకు సంబంధించి 14 ఇళ్ల స్థలాలను సీఎం సిద్ధరామయ్య తన భార్యకు కేటాయించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. 


Similar News