'ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు'.. ప్రధాని మోడీ సందేశం

‘ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు.

Update: 2023-07-04 16:12 GMT

న్యూఢిల్లీ: ‘ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు సంకోచించకూడదు’ అని ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల సమక్షంలోనే స్పష్టం చేశారు. మంగళవారం షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) వర్చువల్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ రూపంలోనైనా చేసే పోరాటానికి పరస్పర సహకారం అవసరమని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన జరిగిన ఎస్‌సీవో వర్చువల్ సమ్మిట్‌లో కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాధినేతలు కూడా పాల్గొన్నారు. వివాదాలు, ఘర్షణలు, ఉద్రిక్తతలు, అంటువ్యాధులు చుట్టుముట్టిన ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం పెద్ద సవాల్‌గా మారిందని, దీన్ని ఎదుర్కొనేందుకు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.

అఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా ఆందోళన చెందుతోందన్నారు. ఎస్‌సీవో సభ్య దేశాల్లో స్టార్టప్, ఇన్నోవేషన్, సాంప్రదాయ వైద్యం, యువత సాధికారత, డిజిటల్ చేరిక, బౌద్ధ వారసత్వం సహకార స్తంభాలుగా భారత్ స్థాపించిందని ప్రధాని మోడీ అన్నారు. ఎస్‌సీవోలో సంస్కరణలు, ఆధునికీకరణ ప్రతిపాదనకు భారత్ మద్దతు ఇస్తుందన్నారు. ఎస్‌సీవో సభ్యత్వం కోరిన బెలారస్‌ను స్వాగతించారు. ఎస్‌సీవోలో పరిశీలక దేశంగా 2005లో చేరిన భారత్, పాకిస్తాన్ 2017లో పూర్తి సభ్య దేశాలుగా మారాయి.


Similar News