‘‘సెంచరీ’’ దిశగా ప్రధాని మోడీ.. కేంద్ర ప్రభుత్వం భారీ ప్లాన్!

ప్రధాని మోడీ ప్రతి నెలా నిర్వహించే మన్ కీ బాత్ సెంచరీకి చేరువవుతున్నది.

Update: 2023-04-25 11:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ ప్రతి నెలా నిర్వహించే మన్ కీ బాత్ సెంచరీకి చేరువవుతున్నది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విస్తృత ప్రజానీకానికి సందేశాన్ని అందించే ఉద్దేశంతో ఫస్ట్ ఎపిసోడ్‌ను 2014 అక్టోబరు 3న మొదలుపెట్టారు. గత నెల 26న 99వ ఎపిసోడ్ పూర్తయింది. ఈ నెల 30న 100వ ఎపిసోడ్‌ను నేరుగా ప్రజలతోనే ముఖాముఖిగా మాట్లాడేలా ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యింది.

ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 100 మంది గెస్టుల జాబితాను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వారికి ఆహ్వానాలు పంపుతూ ఉన్నది. తెలంగాణకు చెందిన మాలావత్ పూర్ణతో పాటు రైతు చింతల వెంకటరెడ్డి, డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య, మీరా షెనాయ్, సంతోష్, అపర్ణా వీరు, శ్రీనివాసన్ ఉన్నారు. ప్రత్యేక అతిథిగా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను కూడా ఆహ్వానిస్తున్నది.

ప్రధాని హోదాలో ఇప్పటివరకు రేడియో ద్వారా మాట్లాడిన మోడీ.. ఈసారి మాత్రం ముఖాముఖిగానే తన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా హాజరై మన్ కీ బాత్ కార్యక్రమం ఆలోచన మొదలు ఇప్పటివరకు జరిగిన 99 ఎపిసోడ్‌లను వివరించే కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించనున్నారు.

ప్రధాని మొత్తం 99 కార్యక్రమాల్లో ఒక్కోసారి ఒక్కో రంగానికి, ఒక్కో రాష్ట్రానికి చెందిన ప్రముఖుల పేర్లను ప్రస్తావించినందున వారికి ఆహ్వానాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. హస్తకళలు, సంప్రదాయ కళలు, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి, కొవిడ్ సమయాల్లో మానవ సేవ చేసిన సామాన్యులు తదితరులను కూడా ఈ కార్యక్రమానికి పిలుస్తున్నది.

నారీ శక్తి పేరుతో ఒక సెషన్‌ను నిర్వహిస్తున్నందున అందులో మాలావత్ పూర్ణ, నిఖత్ జరీన్‌లకు కూడా స్థానం లభించింది. తొలుత హిందీలో మాత్రమే ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం క్రమంగా ఇంగ్లీషు, సంస్కృతం మొదలు మొత్తం 23 భారతీయ భాషల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, మొత్తం 700 మంది వ్యక్తుల, 300 సంస్థల పేర్లను ప్రధాని ఈ ప్రసంగాల్లో ప్రస్తావించినందున 100 మందిని ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అదనంగా మరో ఏడుగురిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నది. 

Tags:    

Similar News