Vande Bharat Train: రేపు ఒకేసారి 9 వందే భారత్ రైళ్లు.. ప్రారంభించనున్న ప్రధాని మోఢీ

ఏకంగా తొమ్మిది వందే భారత్ రైళ్లను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

Update: 2023-09-23 13:06 GMT

న్యూఢిల్లీ : ఏకంగా తొమ్మిది వందే భారత్ రైళ్లను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ తొమ్మిది వందే భారత్ రైళ్లు 11 రాష్ట్రాలను కనెక్ట్ చేస్తాయి. ఆదివారం ప్రారంభం కాబోయే వందే భారత్ రైళ్లలో మూడు రైళ్లు తిరుపతి, మదురై, పూరీ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను కనెక్ట్ చేస్తాయి. హైదరాబాద్ (కాచిగూడ) -బెంగళూరు, రేణిగుంట మీదుగా విజయవాడ - చెన్నై, ఉదయపూర్ - జైపూర్, తిరునెల్వేలి-మధురై-చెన్నై, పాట్నా - హౌరా, కాసరగోడ్-తిరువనంతపురం, రూర్కెలా-భువనేశ్వర్-పూరి, రాంచీ-హౌరా, జామ్‌నగర్-అహ్మదాబాద్ రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తప్ప మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రోజూ తెల్లవారుజామున 5.30 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ జంక్షన్‌కు చేరుకుంటుంది.

ఇదే రైలు తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయల్దేరి, రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు రోజూ తెల్లవారుజామున 5.30 గంటలకు కాచిగూడలో బయల్దేరితే మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్ జంక్షన్‌లో బయల్దేరితే రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ తొమ్మిది వందే భారత్ రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలలో కనెక్టివిటీని పెంచుతాయి. వీటివల్ల ప్రయాణికులకు సగటున 3 గంటల వరకు ప్రయాణ సమయం ఆదా అవుతుంది.


Similar News