PM Modi: గూండాయిజంతో సభను నియంత్రిస్తున్నారు. పార్లమెంటు చర్చలపై మోడీ కామెంట్స్
పార్లమెంటులో చర్చలు సానుకూలంగా జరగాలని అధికార, విపక్ష పార్టీలను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కోరారు
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో చర్చలు సానుకూలంగా జరగాలని అధికార, విపక్ష పార్టీలను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కోరారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి(winter session of Parliament) ముందు పార్లమెంట్ బయట ఉన్న మీడియా పాయింట్ వద్ద మోడీ ప్రసంగించారు. ‘‘ప్రస్తుతం 2024ను పూర్తి చేసుకోబోతున్నాం. 2025 కోసం దేశం సిద్ధమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. దానికి గుర్తుగా మంగళవాలం సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందాం’’ అని మోడీ అన్నారు.
కాంగ్రెస్ పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీపై మోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘ప్రజలు తిరస్కరించిన కొందరు వ్యక్తులు.. కొందరితో గూండాయిజం చేయించి, పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశప్రజలను వారి చర్యలను చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వారిని కూడా శిక్షిస్తారు. 80-90 సార్లు నిరంతరంగా ప్రజలచే తిరస్కరణకు గురైన వారు పార్లమెంటులో చర్చలు జరగనివ్వడం లేదు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించరు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోరు. వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు. అందుకే వారు ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరు.” అని మోడీ అన్నారు. అయితే, పార్టీలతో సంబంధం లేకుండా కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైనవారు సరికొత్త ఆలోచనలతో వస్తుంటారు. కొందరి గందరగోళ చర్యల వల్ల కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రావట్లేదు. అని మోడీ అన్నారు.