జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తదితరులు గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.

Update: 2024-10-02 03:16 GMT

దిశ, వెబ్ డెస్క్: జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళులు అర్పించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్ ఘాట్ వద్దకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అంతకంటే ముందు X వేదికగా గాంధీకి అంజలి ఘటించారు. బాపూజీ జీవితమంతా సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే గడిచిందని, ఆయన ఆదర్శాలు దేశప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని పేర్కొన్నారు. దేశ ప్రజలందరి తరపున బాపూజీకి నివాళులు అర్పిస్తున్నానని ప్రధాని ట్వీట్ లో తెలిపారు. అలాగే దేశ సైనికులు, రైతులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం ఆతిశీ మర్లేనా తదితరులు గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవ, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.


Similar News