PM Modi first visit to Brunei: బ్రూనై బయల్దేరిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ బ్రూనై పర్యటనకు బయల్దేరారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Update: 2024-09-03 06:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ బ్రూనై పర్యటనకు బయల్దేరారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు దేశాల మధ్య 40 ఏళ్ల దౌత్య సంబంధాలు ఉన్నప్పటికీ.. భారత ప్రధానులు ఎవరూ అక్కడ పర్యటించకపోవడం గమనార్హం. ఇకపోతే, బ్రూనై పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ‘ఎక్స్‌’లో ఒక ట్వీట్‌ చేశారు. "రాబోయే రెండు రోజుల్లో బ్రూనై, సింగపూర్‌లను సందర్శిస్తా. ఈ దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటా. బ్రూనై, సింగపూర్‌లతో భారత్‌ సంబంధాలు బలోపేతమవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు" అని పోస్టు చేశారు. బ్రూనై, సింగపూర్‌లతో భారత్‌ సంబంధాలు బలోపేతమవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. రక్షణ, వాణిజ్యం, ఇంధనం, స్పేస్ టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటనే లక్ష్యమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ తెలిపారు. భారత్, బ్రూనైలు "రక్షణలో జాయింట్ వర్కింగ్ గ్రూప్" ఏర్పాటుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

మోడీ సింగపూర్ పర్యటన

సింగపూర్‌లో ప్రధాని మోడీ సెప్టెంబర్‌ 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వోంగ్‌తో పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఆరేళ్ల తర్వాత మోడీ సింగపూర్ లో పర్యటించనున్నారు. సింగపూర్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పర్యటన తోడ్పడుతుందని విదేశీవ్యవహారాల శాఖ తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడుల్లో స్థిరమైన వృద్ధి, బలమైన రక్షణ సహకారం సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందాయని పేర్కొంది. సింగపూర్‌లో ప్రధాని మోడీ సీఈవోలు, బిజినెస్ మెన్ లతో ఇంటరాక్టివ్ సెషన్ ఉంది. దక్షిణ చైనా సముద్రం, మయన్మార్ సహా ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.


Similar News