అయోధ్య రాముడి సన్నిధిలో ప్రధాని మోడీ.. యూపీ సీఎంతో కలిసి రోడ్ షో
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ప్రధాని మోడీ రామమందిరాన్ని దర్శించుకోవడం ఇదే తొలిసారి.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్, బీహార్‌లలో ప్రచారం ముగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు. రామమందిరాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ప్రధాని మోడీ రామమందిరాన్ని దర్శించుకోవడం ఇదే తొలిసారి. రామాలయంలో పూజలు చేసిన తర్వాత సుగ్రీవా ఖిల్లా నుంచి లతా మంగేష్కర్ చౌక్ వరకు ప్రధాని మోడీ రెండు కిలోమీటర్ల పొడవున రోడ్‌షోను నిర్వహించారు. ఈ రోడ్‌షోలో ప్రధాని మోడీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ప్రధాని మోడీ రాకతో ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాని మోడీ రోడ్‌షోకు మహిళలు కూడా బ్రహ్మరథం పట్టారు. కాగా, ఈనెల 14వ తేదీన మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు ముందు మోడీ బాలరాముడి ఆశీర్వాదం తీసుకున్నారు.