‘పీఎం - సూరజ్’ పోర్టల్‌కు ప్రధాని శ్రీకారం.. ఏమిటది ?
దిశ, నేషనల్ బ్యూరో : అణగారిన వర్గాలకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణసాయాన్ని, ఆర్థిక చేయూతను అందించేందుకు ఉద్దేశించిన ‘పీఎం - సూరజ్’ పోర్టల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు.
దిశ, నేషనల్ బ్యూరో : అణగారిన వర్గాలకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణసాయాన్ని, ఆర్థిక చేయూతను అందించేందుకు ఉద్దేశించిన ‘పీఎం - సూరజ్’ పోర్టల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అణగారిన వర్గాల ఎంట్రప్రెన్యూర్లతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ పోర్టల్‌కు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా దేశంలోని 500 జిల్లాల్లో నివసిస్తున్న ఎస్సీలు, డీనోటిఫైడ్, సంచార, సెమీ సంచార జాతులు, ఇతర వెనుకబడిన తరగతులు, సఫాయీ కర్మచారీ వర్గాలకు చెందిన లక్ష మంది లబ్ధిదారులకు దాదాపు రూ.720 కోట్లు విలువైన రుణాలను ఆయన పంపిణీ చేశారు. కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పలువురు వ్యాపారవేత్తలతో ఈసందర్భంగా ప్రధాని వర్చువల్‌గా సంభాషించారు. అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన వ్యక్తులకు రుణ సాయాన్ని అందేలా చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర సంస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. ‘‘మెడికల్ ప్రవేశ పరీక్షలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్ మేం కల్పించాం. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిందీ మేమే. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్, ఆదివాసీ ద్రౌపది ముర్మును వరుసగా రాష్ట్రపతులుగా చేసింది మేమే. అణగారిన వర్గాల ప్రజలను అగ్రస్థానానికి చేర్చాలనే మా పార్టీ నిబద్ధతకు ఇవే నిదర్శనాలు’’ అని మోడీ వివరించారు.