Independence Day: రికార్డు బ్రేక్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కాగా.. ఈ ప్రసంగంతో మోడీ అరుదైన ఘనతను సాధించారు.

Update: 2024-08-15 09:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కాగా.. ఈ ప్రసంగంతో మోడీ అరుదైన ఘనతను సాధించారు. అత్యిక సమయం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన మోడీ రికార్డులకెక్కారు. జెండా ఆవిష్కరించిన తర్వాత 98 నిమిషాల పాటు విరామం లేకుండా ఆయన ప్రసంగించారు. ప్రధానిగా మోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సగటున 82 నిమిషాల పాటు ప్రసంగించారు. దేశచరిత్రలో ఏ ఇతర ప్రధాని కూడా ఇంతసేపు ప్రసంగించలేదు.

అత్యధికంగా 96 నిమిషాలు.. అత్యల్పంగా 56 నిమిషాలు

ఇకపోతే, 2016లో ప్రధాని మోడీ 96 నిమిషాలపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేశారు. 2017లో మోడీ అత్యల్పంగా 56 నిమిషాల పాటు మాట్లాడారు. 2014లో ప్రధానిగా ఎర్రకోట నుంచి మోడీ తొలి తొలిసారిగా 65 నిమిషాల పాటు ప్రసంగించారు. 2015లో 86 నిమిషాలు, 2016లో 96 నిమిషాల పాటు మాట్లాడారు. 2017లో గంట కంటే తక్కువగా 56 నిమిషాల పాటు, 2018లో 83 నిమిషాలు మాట్లాడారు. 2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత పాల్గొన్న తొలి స్వాతంత్ర్య వేడుకల్లో 92 నిమిషాల పాటు ప్రసంగించారు. 2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు మాట్లాడారు. 2022లో 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు జాతినుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఎర్రకోట నుంచి 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు.

17 సార్లు ప్రసంగించిన నెహ్రూ

మోడీ కంటే ముందు 1947లో జవహర్‌లాల్ నెహ్రూ 72 నిమిషాలు, 1997లో ఐకే గుజ్రాల్ 71 నిమిషాల పాటు ప్రసంగాలు చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు 14 నిమిషాల పాటు ప్రసంగించి అత్యల్పంగా మాట్లాడారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట నుండి అత్యల్పంగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు. 2012, 2013లో మన్మోహన్ సింగ్ 32, 35 నిమిషాల పాటు ప్రసంగించారు. 2002, 2003లో వాజ్ పేయ్ వరుసగా 25, 30 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధానిగా ఇప్పటివరకు అత్యధికంగా 17 సార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలను జవహర్ లాల్ నెహ్రూ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 16 సార్లు పంద్రాగస్టు నాడు మాట్లాడగా.. 1972లో సుదీర్ఘంగా 54 నిమిషాలు ప్రసంగించారు.


Similar News