PM Modi : జమ్మూలో పెరుగుతున్న ఉగ్రదాడులతో భద్రతపై ప్రధాని మోడీ సమావేశం

ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Update: 2024-07-18 10:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న వరుస ఉగ్ర దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో సైన్యం ఉగ్రవాదులకు గట్టిగానే బదులిస్తున్నప్పటికీ సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతుండటం విషాదం. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గురువారం సైతం ఉదయం దోడా జిల్లాలో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశానికి నిర్ణయించారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను అంచనా వేసేందుకు గత నెలలోనూ ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ ప్రాంతంలో పెరిగిన తీవ్రవాద కార్యకలాపాలను నిలువరించేందుకు భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. గత 32 నెలల్లో చేపట్టిన చర్యల నేపథ్యంలో అధికారులతో సహా 48 మంది ఆర్మీ సిబ్బంది మరణించారు.


Similar News