స్తంభించిన Microsoft సేవలు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి రియాక్షన్ ఇదే
మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్రస్థాయి సాంకేతిక సమస్య తలెత్తింది.
దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్రస్థాయి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా ‘బ్లూ స్కీన్ ఆఫ్ డెత్’ ఎర్రర్ యూజర్లను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ ప్రభావంతో క్లౌడ్ సర్వీస్ బేస్ మీద నడిచే పీసీలు, ల్యాప్‌టాప్‌లు వాటంతట అవే రీ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా పలు కంప్యూటర్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వట్లేదు. దీంతో బ్యాంకింగ్, ఎయిర్‌లైన్స్, ఐటీ, బ్రాడ్ కాస్టింగ్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సేవలు స్తంభించడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో విమాన సేవల్లో అంతరాయ ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎయిర్‌పోర్టుల్లో రిలాక్స్ అయ్యేందుకు ఎక్స్‌ట్రా సీట్లు, మంచినీరు, ఆహారం ఏర్పాటు చేయాలని వివిధ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని సాధ్యం అయినంత త్వరగా వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.