పాక్ ఏజెంట్‌కు సైనిక సమాచారం లీక్‌ చేసిన ఇంజినీర్‌

ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానంటూ మోసగించిన అమ్మాయి వలలో పడి ఆ ఇంజనీర్ రక్షణ శాఖ రహస్యాలను అందించారు.

Update: 2024-05-10 10:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం గూఢచర్యం చేసిన కారణంగా గుజరాత్‌లోని భరూచ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భరూచ్‌లోని అంక్లేశ్వర్‌లో నివసిస్తున్న ప్రవీణ్ మిశ్రా, పాకిస్థాన్ ఐఎస్‌ఐ కోసం భారత సాయుధ దళాలు, రక్షణ పరిశోధన సంస్థల గురించి రహస్య సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానంటూ మోసగించిన అమ్మాయి వలలో పడి ఆ ఇంజనీర్ రక్షణ శాఖ రహస్యాలను అందించారు. దాంతో సీబీఐ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రవీణ్ మిశ్రా భారత సాయుధ దళాలకు క్షిపణి, డ్రోన్ విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన సోనాల్ గార్గ్ అనే మహిళ అతనితో ఐబీఎంలో పనిచేస్తున్నట్టు నమ్మబలికింది. అయితే, నిజానికి ఆమె పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్. ఆమె మాయలో పడిన ప్రవీణ్ సైన్యం, రక్షణ సంస్థకు చెందిన కీలక సమాచారాన్ని ఆమెకు అందజేశాడు. అంతేకాకుండా కంపెనీ కంప్యూటర్లలో మాల్‌వేర్ పంపించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే, అతని వ్యవహారంపై సందేహించిన ఉదంపూర్ మిలటరీ ఇంటిలిజెన్స్ విభాగం తక్షణం గుజరాత్ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ సీఐడీ అధికారులు భరూచ్‌లో అతన్ని అరెస్ట్ చేశారు. అతని ఫోన్ నుంచి కీలక డిఫెన్స్ సమాచారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 

Tags:    

Similar News