South Korea: 'ఎమర్జెన్సీ' ప్రకటనతో దక్షిణ కొరియా అధ్యక్షుడికి పదవీ గండం?
దక్షిణకొరియాలో(South Korea) రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.( Yoon Suk Yeol ) ఎమర్జెన్సీ(Emergency) విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ఆ దేశ అధ్యక్షుడు(South Korea President) యూన్ సుక్ యోల్ వెనక్కి తగ్గారు.
దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణకొరియాలో(South Korea) రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎమర్జెన్సీ(Emergency) విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ఆ దేశ అధ్యక్షుడు(South Korea President Yoon Suk Yeol) యూన్ సుక్ యోల్ వెనక్కి తగ్గారు పార్లమెంటులో ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Emergency Martial Law) అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. దానికి ఆమోదం లభించడంతో ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఎమర్జెన్సీ విధింపు.. 12 గంటల్లోనే ఎత్తివేత.. ఇలాంటి పరిణామాలు అధ్యక్షుడిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎమర్జెన్సీ ప్రకటనతో అధ్యక్షుడిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. యూన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఆయన రాజీనామా చేయకుండే అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవాలని ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేసింది. కాగా.. దీనిపై యూన్ ఇంకా స్పందించలేదు. అయితే, ఆయన పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు అధ్యక్షుడి సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్యే బుధవారం జరగాల్సిన తన అధికారిక షెడ్యూల్‌ను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. ఇకపోతే, దక్షిణకొరియా పార్లమెంట్‌లో 300 మంది సభ్యులున్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను నెగ్గాలంటే 2/2 వంతు మెజార్టీ కావాలి. అంటే, కనీసం 200 మంది సభ్యుల మద్దతు అవసరం, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ, ఇతర చిన్న విపక్ష పార్టీలంతా కలిపి 192 మంది ఉన్నారు. అధ్యక్షుడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం 190-0తో నెగ్గింది. ఈ పరిణామాలన్నీ చూస్తే యూన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడం ఖరారయినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ సాయంత్రం ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Emergency Martial Law) విధించారు. అధ్యక్షుడి ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధ్యక్షుడి ప్రకటనతో సైన్యం రంగంలోకి దిగింది. పార్లమెంటు, ఇతర రాజకీయా సమావేశాలు నిర్వహించరాదంది. దీంతో, వేలాది మంది నిరసనకు దిగారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఫలితంగా ఘర్షణలు చెలరేగాయి. అటు, దేశాధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ(Democratic Party) తీవ్రంగా ఖండించింది. అటు సొంత పార్టీ నుంచి కూడా దీనిపై వ్యతిరేకత వచ్చింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. నేషనల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతేకాకుండా మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ వూ వోన్ షిక్(Woo Won Shik) ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంతో అధ్యక్షుడు యూన్ వెనక్కి తగ్గారు. దక్షిణ కొరియా చట్ట ప్రకారం పార్లమెంటులో మెజారిటీ ఓటు అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే ఎమర్జెన్సీని ఎత్తేయవచ్చు. ఇక, స్పీకర్ ప్రకటనతో ఎమర్జెన్సీ విధిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు యూన్ మరో ప్రకటన చేశారు. దీంతో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అత్యయిక పరిస్థితిని అధికారికంగా ఎత్తివేశారు.