ఆ పదవి ఇవ్వకుంటే స్పీకర్ సీటుకు ‘ఇండియా’ రేసు
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరిది ? ఆ కీలకమైన పదవిని ఎన్డీయే కూటమిలోని ఏ పార్టీ దక్కించుకోబోతోంది ?
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరిది ? ఆ కీలకమైన పదవిని ఎన్డీయే కూటమిలోని ఏ పార్టీ దక్కించుకోబోతోంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో విపక్ష ఇండియా కూటమి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై కన్నేసింది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 233 లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న ఇండియా కూటమి దూకుడుపై ఉంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు వదలకుంటే.. స్పీకర్ పదవి రేసులోనూ తమ అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమి యోచిస్తోందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 18వ లోక్‌సభ తొలి సెషన్ జూన్ 24న ప్రారంభమై జులై 3న ముగియనుంది. తొమ్మిది రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. స్పీకర్ గైర్హాజరీలో డిప్యూటీ స్పీకర్ అన్నీ తానై లోక్‌సభను నడుపుతుంటారు. అలా అని డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండేవారు.. స్పీకర్‌కు సబార్డినేట్ కాదు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్ అనేది ఓ స్వతంత్ర పదవి. అందుకే తమకు భారీ సంఖ్యలో సీట్లు వచ్చిన ప్రస్తుత సందర్భాన్ని అందిపుచ్చుకొని కనీసం డిప్యూటీ స్పీకర్ పదవిని కైవసం చేసుకోవాలని ఇండియా కూటమి యోచిస్తోంది.