రేపటి పార్లమెంటు సెషన్‌కు విపక్షం ప్లాన్ ఇదీ..

దిశ, నేషనల్ బ్యూరో : నీట్ పరీక్షలో అవకతవకల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది.

Update: 2024-06-27 13:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నీట్ పరీక్షలో అవకతవకల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శుక్రవారం రోజు పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉండగా.. నీట్ అంశంపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెడతామని విపక్ష కూటమి ప్రకటించింది. గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ అంశంతో పాటు సీబీఐ, ఈడీల దుర్వినియోగం, గవర్నర్ కార్యాలయం దుర్వినియోగం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను లోక్‌సభ, రాజ్యసభల్లో లేవనెత్తేందుకు విపక్ష కూటమిలోని పార్టీలు సిద్ధమయ్యాయి.

శుక్రవారం రోజు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష సభ్యులు సమావేశం కానున్నారు. ఇండియా కూటమి పార్టీల భేటీ అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందించారు. ‘‘నీట్ వ్యవహారంలో జరిగిన తప్పుల నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకోలేదు. దేశంలోని యువత న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. నీట్ అవకతవకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి. దేశంలోని ప్రతీరెండో యువకుడు నిరుద్యోగే. నిరుద్యోగ నిర్మూలనకు మోడీ సర్కారు వద్ద సరైన విధానమేదీ లేదు’’ అని ఖర్గే పేర్కొన్నారు.


Similar News