Operation Sadbhav: ‘ఆపరేషన్ సద్భవ్‌’ వేగవంతం.. మయన్మార్‌కు రెండో విడత సాయం పంపిణీ

యాగీ తుపాన్‌ వల్ల నష్టపోయిన దేశాలను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ సద్భవ్‌ పేరుతో అత్యవసర మానవతాసాయం అందిస్తోంది.

Update: 2024-09-17 12:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యాగీ తుపాన్‌ వల్ల నష్టపోయిన దేశాలను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ సద్భవ్‌ పేరుతో మయన్మార్, లావోస్, వియత్నాంలకు అత్యవసర మానవతాసాయం అందిస్తోంది. ఇందులో భాగంగా మయన్మార్‌కు మంగళవారం రెండో విడత సాయాన్ని పంపింది. జనరేటర్ సెట్లు, మందులతో సహా 40 టన్నులకు పైగా సహాయక సామగ్రిని అందజేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానంలో దీనిని పంపించారు. జనరేటర్ సెట్లు, మెడిసిన్స్, తాత్కాలిక షెల్టర్లు, నీటి శుద్దీకరణ సామగ్రితో సహా 32 టన్నుల మెటీరియల్‌లను విమానం తీసుకువెళ్లినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అంతేగాక10 టన్నుల రేషన్‌ను సైతం పంపించినట్టు వెల్లడించారు.

మొదటి విడతలో పొడి రేషన్‌, దుస్తులు, మందులతో సహా 10 టన్నుల సహాయాన్ని మయన్మార్‌కు భారత్ పంపించింది. మరోవైపు, కరువుతో బాధపడుతున్న నమీబియా ప్రజలకు సహాయం చేయడానికి సైతం భారత్ నమీబియాకు మానవతా సహాయంగా 1,000 టన్నుల బియ్యాన్ని పంపింది. న్హవా శేవా ఓడరేవు నుండి దీనిని పంపించారు. ‘విశ్వసనీయమైన, నమ్మకమైన స్నేహితుడిగా, భారత్ నమీబియా ప్రజలకు ఆహార ధాన్యాల సహాయాన్ని అందిస్తోంది. ఇటీవలి కరువు పరిస్థితుల నేపథ్యంలో వారి ఆహార భద్రతను పటిష్టం చేస్తుంది’ అని జైస్వాల్ పేర్కొన్నారు. 


Similar News