కేజ్రీవాల్ పాత్రపై మాత్రమే విచారణ కొనసాగుతోంది: సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై మాత్రమే దర్యాప్తు జరుగుతోందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్పష్టం చేసింది. మిగతా నిందితులందరి పాత్రపై దర్యాప్తు పూర్తైందని తెలిపింది.

Update: 2024-07-06 15:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై మాత్రమే దర్యాప్తు జరుగుతోందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్పష్టం చేసింది. మిగతా నిందితులందరి పాత్రపై దర్యాప్తు పూర్తైందని తెలిపింది. ఈ మేరకు సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే దర్యాప్తును ముగించి, తుది ఫిర్యాదు చార్జిషీట్‌ను జూలై 3 లేపు దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంతకుముందు తెలిపారు. అయితే ఇటీవలే కొత్త వాస్తవాలు బయటపడ్డాయని, వాటిని అప్‌డేట్ చేస్తామని చెప్పారు. ఈ వివరాలు సైతం త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జూలై 7న సిసోడియా రిమాండ్ ముగియనుంది. దీంతో, సీబీఐ సిసోడియాను కోర్టులో హాజరుపర్చగా ఈ నెల 15 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. విచారణ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. సీబీఐ కేసు దర్యాప్తును పూర్తి చేసిందన్నారు. కానీ, తమ సౌలభ్యం కోసం సీబీఐ తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆరోపించారు. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. తమ ప్రకటనలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది. ఎమ్మెల్యే నిధుల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు సిసోడియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.


Similar News