యూసుఫ్ పఠాన్‌కు లోక్‌సభ టికెట్.. ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ ఇదీ..
దిశ, నేషనల్ బ్యూరో : భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలువనున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలువనున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఆయనకు బర్హంపూర్ లోక్‌సభ టికెట్‌ను కేటాయించింది. బర్హంపూర్.. కాంగ్రెస్ కంచుకోట. అక్కడి నుంచి హస్తం పార్టీ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన సోదరుడికి టీఎంసీ లోక్‌సభ టికెట్‌ను కేటాయించిన విషయం తెలుసుకున్న భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. ‘‘మీ సహనం, దయాగుణం, పేదలకు సహాయం చేసే తత్వం చాలా గొప్పది. అధికారం, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడం మీ నైజం. మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రజల జీవితాల్లో మరింత మార్పు తెస్తారని నేను నమ్ముతున్నాను. మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అంటూ తన సోదరుడు యూసుఫ్ పఠాన్‌ను ఉద్దేశించి ఇర్ఫాన్ పఠాన్ రాసుకొచ్చారు. ఈ పరిణామంపై స్పందించిన అధిర్ రంజన్ చౌదరి.. ఒకవేళ యూసుఫ్ పఠాన్‌ను గౌరవించాలని టీఎంసీ భావిస్తే నేరుగా రాజ్యసభకు పంపించి ఉండాల్సిందని కామెంట్ చేశారు. తన లోక్‌సభ స్థానం బర్హంపూర్‌లో బీజేపీకి సహకరించే ఉద్దేశంతోనే గుజరాత్‌కు చెందిన యూసుఫ్ పఠాన్‌కు మమతా బెనర్జీ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు.