Ganga Water: హరిద్వార్ లోని గంగాజలం తాగడానికి పనికి రాదు- పీసీబీ
Ganga Water In Haridwar 'Unsafe' For Drinking: Pollution Control Board
దిశ, నేషనల్ బ్యూరో: హరిద్వార్(Haridwar) లోని గంగాజలం(Ganga Water) తాగడానికి పనికి రాదని ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి(Uttarakhand Pollution Control Board) స్పష్టం చేసింది. గంగానదిలోని నీటి నాణ్యత కేటగిరి ‘బి’ స్థాయికి పడిపోయిందని పేర్కొంది. ఆ నీరు తాగడానికి సురక్షితం కాదని.. కేవలం భక్తులు స్నానానికి మాత్రమే ఆనీటిని వాడుకోవాలని సూచించింది. ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రతి నెలా ఉత్తరప్రదేశ్ సరిహద్దులో హరిద్వార్ చుట్టూ ఎనిమిది ప్రదేశాలలో గంగా జలాన్ని పరీక్షిస్తుంది. ఇటీవలి పరీక్షల్లో నవంబర్ నెలకు సంబంధించిన గంగా నది నీరు 'బి' కేటగిరీగా తేలింది. కాగా.. గంగాజలాన్ని ఐదు కేటగిరీలుగా విభజించారు. 'ఎ' అతి తక్కువ విషపూరితమైనది.. నీటిని తాగేందుకు వాడుకోవచ్చు. కేటగిరి 'ఇ' అంటే అత్యంత విషపూరితమైనది.
హరిద్వార్ పూజారి
నీటి కాలుష్యంపై హరిద్వార్ స్థానిక పూజారి ఉజ్వల్ పండిట్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాల వల్ల గంగాజల స్వచ్ఛత దెబ్బతింటుందని అన్నారు. “గంగాజలంతో స్నానం చేయడం వల్ల మన శరీరంలోని రోగాలు నయమయ్యేవి. క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నయమయ్యేవి. ఇప్పుడు తీసుకున్న నీటిని పదేళ్ల తర్వాత తనిఖీ చేసినా స్వచ్ఛంగానే ఉంటుంది. అయితే, ఇప్పుడు నీటి నాణ్యత పడిపోవడం మానవవ్యవర్థాల వల్లే. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది” అని ఉజ్వల్ పండిట్ అన్నారు. ఇదిలా ఉండగా, భారతదేశంలోని నదీజలాల్లో, ముఖ్యంగా ఢిల్లీలోని యుమునా నదిలో కాలుష్యం గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.