BREAKING: మోడీ 3.0 సర్కార్ మరో సంచలన నిర్ణయం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా జూన్ 25ను సంవిధాన్ హత్యా
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా (రాజ్యాంగ హత్య దినోత్సవం) (Samvidhaan Hatya Diwas) ప్రకటించింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి నిరసనగా ఇకపై ప్రతి సంవత్సరం 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా నిర్వహించుకోవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రముఖ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు.
కాగా, 1975 జూన్ 25న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల రాజ్యాంగం హత్యకు గురైందన్న కేంద్రం.. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25కు వ్యతిరేకంగా ఓ రోజును కేటాయించినట్లు తెలిపింది. ఎమర్జెన్సీ వల్ల లక్షలాది మందిని అన్యాయంగా కటాకటాల్లోకి నెట్టారని.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నియంత పోకడలతోనే దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీకి దారి తీశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఎమర్జెన్సీ ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీ వల్ల దేశంలో పౌరుల హక్కులు కాలరాయబడ్డాని విమర్శించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో లోక్ సభ దద్దరిల్లింది. సభలో ఎమర్జెన్సీ టాపిక్‌ను ప్రస్తావించడానికి నిరసనగా ప్రతిపక్షం సభను బైకాట్ చేసింది. ఈ క్రమంలో మోడీ సర్కార్ ఏకంగా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా ప్రకటించడంపై కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.