ఇందిరాగాంధీని అవమానించేలా కెనడాలో పరేడ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పరేడ్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అవమానం జరిగింది.

Update: 2023-06-08 12:48 GMT

ఒట్టావా (కెనడా) : కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పరేడ్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అవమానం జరిగింది. ఇందిర హత్యకు సంబంధించిన ఘటనను కెనడాలో నిర్వహించిన ఆ పరేడ్‌లో బొమ్మలతో రీక్రియేట్ చేశారు. ఈ ఘటనను ఒక సంబరంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒక మాజీ ప్రధానికి ఇంతటి అవమానం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ పరేడ్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవర ట్విటర్‌లో షేర్ చేశారు. దీన్ని చూసి తాను దిగ్భ్రాంతి చెందినట్లు తెలిపారు. ఇందిరా గాంధీ మరణం వల్ల భారత దేశానికి కలిగిన బాధను గౌరవించాలని సూచించారు.

ఈ చర్యను దేశ ప్రజలు అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మిలింద్ దేవర ట్వీట్‌కు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ హత్యను కెనడాలో సంబరంగా జరుపుకుంటుంటే మోడీ సర్కార్ చోద్యం చూస్తోందా అని ప్రశ్నించారు.ఈ వీడియోపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటు వాదులకు కెనడాలో చోటు ఇవ్వడం భారత్‌తో ఆ దేశానికి ఉన్న సంబంధాలకు మంచిది కాదని ఆక్షేపించారు. దీంతో భారత్‌లో కెనడా హై కమిషనర్ కామెరూన్ మెక్‌ కే స్పందించారు. ఈ విషయం తెలిసి తాను ఆందోళన చెందానని వెల్లడించారు. ద్వేషానికి, హింసకు కెనడాలో చోటు లేదని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News