Neet UG : నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల
నీట్-యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్‌డేట్ చేసిన ఫలితాలను exams.nta.ac.inలో చూసుకోవచ్చు.
దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్-యూజీ 2024’ పరీక్ష ‘ఫైనల్ రివైజ్డ్ ఫలితాల’ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. అంతకంటే ముందు ఈ పరీక్షకు సంబంధించిన ‘ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీ’ని కూడా ఎన్‌టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ అప్‌డేట్ చేసిన ఫలితాలను exams.nta.ac.in వెబ్‌సైట్‌లో, రివైజ్డ్ ఆన్సర్ కీని nta.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రివైజ్ చేసిన నీట్-యూజీ స్కోర్‌కార్డ్‌లను exams.nta.ac.in/NEET లింకు ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీ, అభ్యర్థి ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్‌లను ఎంటర్ చేసి పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
టాప్ ర్యాంకర్లు వీరే..
రివైజ్డ్ రిజల్ట్స్ ప్రకారం.. 17 మంది అభ్యర్థులకే 1వ ర్యాంకు వచ్చింది. వీరందరికీ 720కి 720 మార్కులు వచ్చాయి. తొలిసారి విడుదల చేసిన నీట్-యూజీ రిజల్ట్స్‌లో అత్యధికంగా 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకులో నిలిచారు. ఇప్పుడు 1వ స్థానంలో నిలిచిన ర్యాంకర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. తాజాగా రివైజ్డ్ ఫలితాల్లో 1వ ర్యాంకు సాధించిన 17 మందిలో నలుగురు రాజస్థాన్ అభ్యర్థులు, ముగ్గురు మహారాష్ట్ర అభ్యర్థులు, ఇద్దరు చొప్పున యూపీ, ఢిల్లీ అభ్యర్థులు ఉన్నారు. నీట్-యూజీ పరీక్షా ఫలితాల జాబితాలోని టాప్-5 విద్యార్థినుల్లో ప్రాచిత(రాజస్థాన్), పాలాంశ అగర్వాల్ (మహారాష్ట్ర), మానే నేహా కుల్దీప్ (మహారాష్ట్ర), ఇరం ఖాజీ(రాజస్థాన్), రిషికా అగర్వాల్ (ఢిల్లీ) ఉన్నారు. టాప్-5 విద్యార్థుల్లో మ్రిదుల్ మాన్య ఆనంద్ (ఢిల్లీ), ఆయుష్ నౌగ్రాయియా (యూపీ), మాజిన్ మన్సూర్ (బిహార్), సౌరవ్ (రాజస్థాన్), దివ్యాంశ్ (ఢిల్లీ) ఉన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, రాష్ట్రాల వైద్యవిద్య డైరెక్టరేట్ల వెబ్‌సైట్లలో విడుదల అవుతాయని ఎన్‌టీఏ వెల్లడించింది. ఇక నీట్ -యూజీ పరీక్షను మొత్తం 24,06,079 మంది అభ్యర్థులు రాశారు. వీరిలో 10,29,154 మంది పురుషులు, 13,76,831 మంది మహిళలు, 18 మంది థర్డ్ జెండర్ వారు ఉన్నారు.
ఎందుకీ రివైజ్డ్ రిజల్ట్స్ ?
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రంలోని ఫిజిక్స్ విభాగంలో అటామిక్ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నపై అభ్యంతరం తెలుపుతూ ఓ అభ్యర్థి ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ‘‘ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి. కానీ 29వ ప్రశ్నకు రెండు సమాధానాలను ఎన్‌టీఏ కన్ఫార్మ్ చేసింది. దీనివల్ల ఆ రెండింటిలో ఏదో ఒకటి టిక్ చేసిన వారికి నాలుగు మార్కులు చొప్పున వచ్చాయి. అయితే నెగెటివ్ మార్కింగ్ భయంతో దానికి ఆన్సర్ ఇవ్వకుండా వదిలేసిన నా లాంటి వాళ్లకు నష్టం జరిగింది’’ అని సదరు అభ్యర్థి కోర్టుకు విన్నవించాడు. దీంతో ఆ ప్రశ్నకు సరైన సమాధానమేదో తేల్చాలని ఐఐటీ ఢిల్లీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 29వ ప్రశ్నకు ‘ఆప్షన్ 4’ సరైన సమాధానమని ఐఐటీ ఢిల్లీ నియమించిన నిపుణుల కమిటీ నిర్ధారించింది. దీంతో ఆప్షన్ 4ను టిక్ చేసిన అభ్యర్థులకే మార్కులివ్వాలని ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈమేరకు మార్పుతో రివైజ్డ్ నీట్-యూజీ రిజల్ట్స్‌ను, రివైజ్డ్ ఆన్సర్ కీని ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది.