Eknath Shinde : స్విట్జర్లాండ్ కంపెనీకి ‘మహా’ బకాయిలు.. సీఎం షిండే సర్కారుకు లీగల్ నోటీసులు

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరం వేదికగా జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొన్నారు.

Update: 2024-10-04 19:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరం వేదికగా జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొన్నారు. అయితే ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులంతా ఎవరి ఆతిథ్య బిల్లులను వారే చెల్లించాల్సి ఉంటుంది. కానీ సీఎం షిండేకు సంబంధించిన రూ.1.58 కోట్ల ఆతిథ్య బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈవిషయాన్ని దావోస్‌లో ‘డబ్ల్యూఈఎఫ్-2024 సదస్సు’ అతిథులకు సేవలు అందించిన ఆతిథ్య కంపెనీ ‘స్కా జీఎంబీహెచ్’ వెల్లడించింది.

గత కొన్ని నెలలుగా తమ బిల్లులను చెల్లించకపోవడాన్ని తప్పుపడుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపింది. ఈ నోటీసులకు సంబంధించిన ఒక కాపీని భారత విదేశాంగ శాఖకు కూడా పంపామని ‘స్కా జీఎంబీహెచ్’ తెలిపింది. ఈ బిల్లుల బకాయిపై తాము జనవరి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తున్నప్పటికీ చెల్లింపులు మాత్రం చేయడం లేదని సదరు స్విట్జర్లాండ్ కంపెనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహార శైలి వల్ల భారత్-స్విట్జర్లాండ్ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని లీగల్ నోటీసులో ‘స్కా జీఎంబీహెచ్’ ప్రస్తావించడం గమనార్హం. 


Similar News