హేమంత్ కర్కరేను హత్య చేసింది కసబ్ కాదు.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలున్న ఓ పోలీసు అధికారి అని ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ నాందేవ్‌రావ్ వాడెట్టివార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని కుదిపేసిన 26/11 ముంబై ఉగ్రవాద దాడి ఘటనలో యాంటీ టెర్రరిజం స్వాడ్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే హతమైన సంగతి తెలిసిందే. అయితే, హేమంత్ కర్కరేను హత్య చేసింది తీవ్రవాది కసబ్ కాదని, ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలున్న ఓ పోలీసు అధికారి అని ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష విధించిన 26/11 ఉగ్రవాద దాడి విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్‌పై కాంగ్రెస్ నేత విజయ్ విమర్శలు చేశారు. ఈ సందర్భంలోనే.. బిర్యానీ ప్రస్తావన తీసుకొచ్చి నికమ్ కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నాడు. కసబ్‌కి ఎవరైనా బిర్యానీ ఇస్తారా. ఈ విషయాన్ని నికమ్ తర్వాత ఒప్పుకున్నాడు. అసలు కోర్టులో సాక్ష్యం కూడా చెప్పని దేశద్రోహి ఎలాంటి లాయర్? ముంబై పోలీసు అధికారి హేమంత్ కర్కరేను బలి తీసుకున్న బుల్లెట్ కసబ్ గన్ నుంచి వచ్చింది కాదు, ఆర్ఎస్ఎస్ విధేయత కలిగిన ఒక పోలీసు అధికారి నుంచి వచ్చింది. ఆ నిజాన్ని దాచిన ద్రోహికి బీజేపీ టికెట్ ఇస్తుందంటే, ఇలాంటి దేశద్రోహుల్ని బీజేపీ మద్దతు ఇస్తోందా అనే ప్రశ్న తలెత్తుతోందని ' విజయ్ నాందేవ్‌రావ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఆయన వ్యాఖ్యలకు బదులిచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కర్యదర్శి వినోద్ తావ్డే.. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఎంతకైనా దిగజారుతుంది. విజయ్ వ్యాఖ్యలు అందుకు తావిస్తున్నాయి. ఆయన ఉద్దేశంలో హేమంత్ కర్కరేను కసబ్ చంపలేదు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న కాంగ్రెస్‌కు సిగ్గులేదా.. దీన్ని బట్టి ఎన్నికల్లో కాంగ్రెస్, వారి యువరాజు గెలిచేందుకు పాకిస్తాన్ ఎందుకు కోరుకుంటోందో అర్థమవుతోందని విమర్శించారు. అయితే, ఆ వ్యాఖ్యలు తనవి కావని, ఎస్ఎం ముష్రీఫ్ రాసిన 'హూ కిల్డ్ కర్కరే' పుస్తకం ఉన్నదాన్నే చెప్పానని విజయ్ నాందేవ్‌రావ్ వెల్లడించారు.