Non-Hindus: మా గ్రామాల్లోకి హిందువేతరులు రావొద్దు.. రుద్రప్రయాగ్‌లో వెలసిన పోస్టర్లు

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న పలు గ్రామాల్లో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి.

Update: 2024-09-08 11:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న పలు గ్రామాల్లో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. హిందువేతరులు, రోహింగ్యా ముస్లింలు తమ గ్రామాల్లోకి రావొద్దని, ఒక వేళ వస్తే చర్యలు తీసుకుంటామని పోస్టర్లలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో ముస్లిం వ్యాపారులు గ్రామాల్లోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు వేసినట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారి దినేష్ భర్నే మాట్లాడుతూ.. పోస్టర్లు వేసిన వారిని పట్టుకుంటామని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మత సామరస్యానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనైనా సహించేది లేదని తెలిపారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు బయటి వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు.

ఈ బోర్డుల వ్యవహారంపై ముస్లిం నాయకులు నిరసన తెలిపారు. సైన్ బోర్డులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నయ్యర్ కజ్మీ ఉత్తరాఖండ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవలి వివాదం తర్వాత ముస్లిం ఇళ్లపై దాడులు చేశారని, చాలా మంది పారిపోయేలా చేశారని ఆరోపించారు. వారం రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే అసదుద్దీన్ ఒవైసీ మార్గదర్శకత్వంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. నేరాలకు పాల్పడే వ్యక్తులనే నేరస్తులుగా పరిగణించాలని, మొత్తం సమాజాన్ని నిందించొద్దని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గణేష్ గోడియాల్ సూచించారు. కాగా, గత వారం చమోలిలో లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. 


Similar News