సంఘ్ పరివార్ పనే అదీ.. గోవాలోనూ ఇంతే: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.

Update: 2024-10-06 12:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘ప్రకృతి సౌందర్యానికి, సామరస్యతకు, వైవిద్యానికి గోవా పెట్టింది పేరు. దురదృష్టవశాత్తు ఇక్కడ బీజేపీ పాలనలో ఈ సారమస్యం ప్రమాదంలో పడింది’ అని ఘాటుగా విమర్శించారు.

‘దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్ ఇలాంటి పనులే చేస్తున్నా ఉన్నతస్థాయిలో వారికున్న మద్దతుతో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. గోవాలోనూ బీజేపీ స్ట్రాటజీ స్పష్టమే: అది ప్రజలను విభజించడం. అలా చేస్తూనే అక్కడి సున్నితమైన పర్యావరణ ప్రాంతాలను అక్రమంగా గ్రీన్ ల్యాండ్‌గా బదిలీ చేయడానికి.. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తున్నది. గోవా సహజ, సామాజిక సంపదను కొల్లగొట్టాలని కుట్ర చేస్తున్నది. గోవా సహా దేశ ప్రజలంతా వారి విభజన అజెండాను స్పష్టంగా చూస్తున్నారు. వారంతా ఏకమవుతున్నారు’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

జీసస్ బోధనలు ప్రచారం చేసే కార్యంలో భాగంగా 16వ శతాబ్దంలో భారత్‌లో (ముఖ్యంగా అప్పటి పోర్చుగీసు కాలనీ గోవాలో) విస్తృత పర్యటనలు చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌ను గోవా ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. గోవా రక్షకుడని ఆరాధిస్తారు. ఆయన అవశేషాలు ఇప్పటికీ గోవాలోని బోమ్ జీసస్ బెసిలికా చర్చిలో భద్రపరచబడి ఉన్నాయి. గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్.. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌ అవశేషాలకు డీఎన్ఏ టెస్టు చేయించాలని, ఆయన నిజంగా గోవా రక్షకుడా? అంటూ తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు. క్రైస్తవ సముదాయ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటంతో గోవాలో క్రైస్తవులు నిరసనలు చేస్తున్నారు. వెలింకర్ పై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News