Aravana Prasadam : ఎరువుగా మారనున్న ఏడాది కిందటి ‘అరవణ ప్రసాదం’
దిశ, నేషనల్ బ్యూరో : శబరిమల అనగానే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం.
దిశ, నేషనల్ బ్యూరో : శబరిమల అనగానే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. అయ్యప్ప స్వామి ఫొటోతో కూడిన చిన్నపాటి టిన్ కంటైనర్‌లో ఉండే ఈ ప్రసాదాన్ని శబరిమలలో అయ్యప్ప భక్తులకు పంపిణీ చేస్తుంటారు. అయితే దాదాపు ఏడాదిగా నిల్వ చేసి ఉంచిన అరవణ ప్రసాదంలోని యాలకులలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు ఉన్నాయంటూ 2023 సంవత్సరం జనవరిలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలను పిటిషనర్ సమర్పించకపోవడంతో, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ ఎక్కువ కాలంగా నిల్వ చేసి ఉంచినందున దాదాపు 6.65 లక్షల టిన్ కంటైనర్లలోని అరవణ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకూడదని ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది. ఆ ప్రసాదాన్ని అడవుల్లో వేయాలని తొలుత ప్రతిపాదించింది.
అయితే ప్రసాదాన్ని అడవుల్లో వేయడం కంటే శాస్త్రీయ పద్ధతి ద్వారా పునర్వినియోగంలోకి తేవడం మంచిదని ఫైనల్‌గా నిర్ణయించింది. ఇందుకోసం ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ బిడ్‌ను కేరళ కంపెనీ ఇండియన్ సెంట్రీఫ్యూజ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ (ఐసీఈఎస్) గెల్చుకుంది. రూ.5.50 కోట్లు విలువైన అరవణ ప్రసాదాన్ని ఎరువుగా మార్చి, రైతుల కోసం వినియోగంలోకి తెస్తామని ఐసీఈఎస్ తెలిపింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ.1.15 కోట్లను ఈ సంస్థ తీసుకుంటోంది. 6.65 లక్షల కంటైనర్లలోని అరవణ ప్రసాదాన్ని తొలుత కొట్టాయంలోని తమ కార్యాలయానికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని తమ ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలిస్తామని ఐసీఈఎస్ వెల్లడించింది.